భాగమతి తర్వాత అనుష్క లాంగ్ గ్యాప్ తీసుకుంది.విదేశాలకు వెళ్లి బరువు తగ్గాక నిశ్శబ్దం చిత్రాన్ని ప్రారంభించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. 

సస్పెన్స్ థ్రిల్లర్ గా నిశ్శబ్దం చిత్రం తెరకెక్కుతోంది. గురువారం రోజు అనుష్క పుట్టినరోజు సంధర్భంగా చిత్ర యూనిట్ నేడు నిశ్శబ్దం టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంలో అనుష్క మాటలు రాని, వినికిడి లోపం ఉన్న దివ్యాంగురాలి పాత్రలో నటిస్తోంది. 

టీజర్ లో అనుష్క దివ్యాంగురాలిగా పలికిస్తున్న హావా భావాలు అద్భుతంగా ఉన్నాయి. మంచి పాత్ర దొరికితే అనుష్క ఎలా నటిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఛాలెంజింగ్ రోల్ లో కూడా అనుష్క తన నటనతో మెప్పించింది. అనుష్క ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్న షాట్స్ టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి. 

ఓ వెకేషన్ అనుష్క జీవితాన్ని మార్చేస్తుంది. అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి అనే విషయాన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో దర్శకుడు చిత్రీకరించినట్లు ఉన్నారు. ఈ చిత్రంలో క్రేజీ హీరో మాధవన్ కీలక పాత్రలో నటించాడు. ఇక అంజలి, షాలిని పాండే కూడా కీలక పాత్రల్లో నటించారు. 

కథా పరంగా ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా అమెరికాలో జరిగింది. డిసెంబర్ లో నిశ్శబ్దం చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా నిశ్శబ్దం చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా టీజర్ ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లాంచ్ చేశారు.