రూల్స్  పాటించకుండా తయారుచేస్తున్న ఓ వంటనూనె కంపెనీకి ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి అంజలిపై ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఈరోడ్ ప్రధాన కార్యాలయంగా నడుస్తున్న కంపెనీ నూనెను పరిశోధనలకు పంపగా అది ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలిందని కోవైకి చెందిన కోవై సుడర్‌పార్వై మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ కేసుని మరొకరు వెలికితీస్తూ మరో కేసు నమోదు చేసారని తమిళ మీడియా ద్వారా తెలుస్తోంది.

సదరు వివాదం ఎదుర్కొంటున్న నూనె వాడితే ప్రజలు అనారోగ్యం బారిన పడడం ఖాయమన్న విషయం రీసెంట్ గా నిర్వహించిన పరీక్షల్లో తేలిందట. దాంతో ఆ నూనెను ఉత్పత్తి చేస్తున్న కంపెనీ మీద, ఆ నూనెను కొనండంటూ ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్న అంజలి మీద కేసు నమోదయిందట.  అలాగే వీలైనంత త్వరగా ఆ వంట నూనె కంపెనీపై చర్యలు తీసుకొవాలని అధికారులను కోరారు.  

అయితే ఇలా నటీ,నటులు యాడ్స్‌ వివాదంలో చిక్కుకోవడం  కొత్తేం కాదు. ఆ మధ్యన విజయవాడలోని వినియోగదారుల న్యాయస్థానం రాశి, రంభ నటించిన ఓ కమర్షియల్ యాడ్ ను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఆ మధ్యన క్యూనెట్ వివాదంలో పూజా హెగ్డే, బొమన్ ఇరానీ, షారూక్ ఖాన్, అల్లు శిరీష్ తదితరులకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో హీరోలు,హీరోయిన్లు కమర్షియల్ యాడ్స్‌లో నటించేముందు కాస్త వాటి వివరాలు తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఆ ఉత్పత్తుల చెడు ఫలితం ప్రజలతో పాటు వారిపై కూడా పడే ప్రభావం ఉంటుంది.