సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఎక్కడా కనిపించినా అక్కడ సందడే. తన వయసు మీద ఆయన చేసే కామెంట్స్ కి జనాలు పగలబడి నవ్వుతారు. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో సుమ, బ్రహ్మాజీల మధ్య వయసుకి సంబంధించి ఓ సంభాషణ జరిగింది. స్టేజ్ పై ఇద్దరూ కలిసి చేసిన కామెడీ షోకే హైలైట్ గా నిలిచింది.

బ్రహ్మాజీ బయట మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటించిన బ్రహ్మాజీ ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా సెట్ లో బ్రహ్మాజీ, అనీల్ రావిపూడి కలిసి తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు బ్రహ్మాజీ. ఈ ఫోటోకి 'మేమిద్దరం ఒకప్పుడు క్లాస్ మేట్స్.. ఇప్పుడు సెట్ లో మళ్లీ సెట్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉంది' అని క్యాప్షన్ ఇచ్చారు. దీనికి అనీల్ రావిపూడి వెంటనే 'సేమ్ గ్లాసెస్ అని ఫోటో తీసి, సేమ్ క్లాస్ అంటావా.. నేను మీరు చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను అన్నగారు' అని బదులిచ్చాడు.

వీరిద్దరి మధ్యలోకి వచ్చిన కమెడియన్ వెన్నెల కిషోర్ 'కరెక్ట్.. మా నాన్న.. బ్రహ్మాజీ గారి సినిమాలు చూస్తూ పెరిగాడు. ఇప్పుడు నేను కూడా ఆయన సినిమాలు చూస్తూ పెరుగుతున్నా..' అని ట్వీట్ చేశారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ కామిక్ గా ఉండడంతో నెట్టింట ట్వీట్ల జల్లు కురుస్తోంది.