తెలుగు టెలివిజన్‌ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా' అనే సినిమాతో కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు ఈ స్టార్ యాంకర్‌. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ వరుసగా లిరికల్ వీడియోలను వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఫస్ట్ రిలీజ్‌ చేసిన 'నీలి నీలి ఆకాశం' పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. మ్యూజిక్‌ లవర్స్‌ ఈ పాటను తెగ వింటుండటంతో 100 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి సత్తా చాటింది. సుకుమార్ ద‌గ్గ‌ర 'ఆర్య 2', '1.. నేనొక్క‌డినే' చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్వీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో విజ‌య‌వంత‌మైన చిత్రాల నిర్మాత‌గా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో, 'నీలి నీలి ఆకాశం' పాటతో స‌హా సినిమాలోని అన్ని పాట‌ల‌నూ చంద్రబోస్ రాశారు. ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌పై చిత్రీక‌రించిన‌ 'నీలి నీలి ఆకాశం' పాట 100 మిలియ‌న్ వ్యూస్ దాట‌డంతో చిత్ర యూనిట్ ఖుషీ అవుతున్నారు. చిన్న సినిమాలోని ఓ పాటకు ఈ స్థాయిలో వ్యూస్ రావటం అరుదైన ఫీట్‌ అని భావిస్తున్నారు.

సింగ‌ర్స్‌ సిద్ శ్రీ‌రామ్‌, సునీతలు ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. సినిమాకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయ‌నీ, ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులు స‌మ‌సిపోయి, సాధార‌ణ ప‌రిస్థ‌తి నెల‌కొన్న త‌ర్వాత చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌నీ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై అంద‌రూ క‌లిసిక‌ట్టుగా పోరాడితే విజ‌యం త‌థ్య‌మ‌నీ, అందువ‌ల్ల లాక్‌డౌన్ పీరియ‌డ్‌లో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు.