నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహిస్తోంది. 

రూలర్ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు భారీ ఎత్తున బాలయ్య అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ తరలివచ్చారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో అందాల తార సోనాల్ చౌహన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయభాను వ్యాఖ్యాతగా(యాంకరింగ్) ప్రీరిలీజ్ వేడుక వైభవంగా జరుగుతోంది. రూలర్ మూవీ లో యాంకర్ ఝాన్సీ కీలక పాత్రలో నటించింది. ప్రీరిలీజ్ వేడుకలో ఝాన్సీ మాట్లాడుతూ బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. 

సింహా చిత్రంలో బాలయ్యతో కలసి నటించే అదృష్టం నాకు దక్కింది. మరోసారి బాలయ్యతో కలసి నటించే అవకాశం నాకు కేఎస్ రవికుమార్ ద్వారా దక్కింది. ఈ చిత్రంలో బాలయ్యని చూసి నందమూరి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవడం ఖాయం. ఆయన పర్ఫెక్షన్ చూసి ఆశ్చర్యపోతారు. ఈ చిత్రం కోసం బాలయ్య రెండింతలు కష్టపడ్డారు. మీరంతా బాలయ్యని ఎలా కోరుకుంటారో అలా చూస్తారు. 

ఎప్పటికప్పుడు సినిమాకు అనుగుణంగా తన ఆలోచనల్ని మార్చుకోవడం బాలయ్యకు మాత్రమే సాధ్యం అని ఝాన్సీ తెలిపింది. ఈ చిత్రం పిచ్చ కిర్రాక్ గా ఉండబోతోంది అంటూ ఝాన్సీ వేదికపై అభిమానులని ఉత్తేజపరిచారు. సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు.