సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ స్వపరిచిన, పాటల రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన 'దుమ్ము ధూళి' పాట... ఇంటర్‌నెట్‌లో దుమ్ము రేపుతోంది. ఈ సందర్బంగా పాట రాసిన అనంత శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు.  సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.  

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..  ఈ చిత్రం గురించి చెప్పాలంటే... దర్శకులు మురుగదాస్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన చిత్రాలు, కథలు పరిశోధనాత్మకంగా ఉంటూ, ఎంతోకొంత విజ్ఞానాన్ని మనకు అందిస్తూ... వినోదాత్మక భాషలో ఉంటాయి. ఏదో నేను తెలివైనవాడినని చెప్పడానికి ఆయన ప్రయత్నించకుండా... కొత్త విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చెప్తారు. ఆయన ఒక అద్భుతమైన పోలీస్ కథతో 'దర్బార్' తెరకెక్కించారు.

ఆయన గత చిత్రాలు విజయవంతమైనట్టుగా, ఈ చిత్రం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను.  నేను ఇంతకు ముందు మురుగదాస్ గారితో కలిసి 'స్టాలిన్'కి పని చేశా. చిరంజీవిగారి పరిచయ గీతం 'పరారే పరారే' రాశాను. అది కూడా మంచి విజయవంతమైంది. ఇప్పుడు ఈ 'దర్బార్'లో రజనీగారి పరిచయ గీతం విజయవంతమైంది. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగుతుందేమో చూడాలి. అంతా దైవేచ్ఛ.  

లైకా ప్రొడక్షన్స్ సంస్థ వరుసగా రజనీకాంత్ గారితో సినిమాలు చేస్తున్నారు. అలాగే, చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. చాలామంచి నిర్మాతలు.  సాంకేతిక నిపుణులను, నటీనటులను గౌరవించే నిర్మాతలు. వాళ్ళకు తెలుగులో మంచి విజయాలు రావాలనీ, 'దర్బార్' ద్వారా మరో సంచలనం వారి ఖాతాలో చేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ గారు 'దర్బార్' చిత్రాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్నారు. వారికీ 'దర్బార్' ద్వారా మంచి విజయం రావాలని, ఈ సంక్రాంతి వారికి నిజమైన పండగ తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని అనంత శ్రీరామ్ మాట్లాడారు.