అల్లు రామలింగయ్య గారికో సరదా ఉంది. జనంలో తిరగాలని..వాళ్లు తమని గుర్తు పట్టి వెంటబడితే ఆనందంగా పారిపోవాలని. అందుకోసం ఆయన చిన్న చిన్న సాహసాలు చేస్తూండేవారు. ఓ సారి షూటింగ్ అయిపోగానే ఆయన   తన కారులో లాడ్జికి బయిలుదేరారు. మధ్యలో కారు ఆపమన్నారు. ఎందుకు అన్నాడు అదే కారులో ప్రయాణిస్తున్న ఓ విలేకరి.

ఎందుకేమిటి సబ్బు కొనుక్కోవాలి అన్నారు అల్లు రామలింగయ్య.  లాడ్జికెళ్తే బాయ్ తెస్తాడుగా...  అని విలేకరి అన్నాడు.  దానికి ఆయన మీకేం బాబూ...స్నానం చేసి పౌడరు రాసుకొచ్చారు. నా మొహం చూడండి మోకప్ తీసేసి, ఆయిల్ పూసుకునేసరికి, ఎంత  జిడ్డుగా తయారైందో. వెళ్లి వెళ్లంగానే స్నానం చెయ్యాలి. బాయ్ కోసం ఎదురుచూస్తూ కూచోడం నా వల్ల కాదు అంటూ కారు దిగి ఎదురుగా ఉన్న షాపు లోకెళ్లాడు.

అక్కడ జనం ఉన్నారు కాని మేకప్ తీసేసి, సాధారణ దుస్తుల్లో ఉన్న రామలింగయ్యని ఎవరూ గుర్తు పట్టలేదు.  దాంతో రామలింగయ్య ...ఫలానా సబ్బెంత అనడిగాడు. నాలుగు రూపాయల చిల్లర అన్నాడు షాపువాడు. నిజానికి ఆ సబ్బు ఖరీదంతే. అయితే అల్లు ...అంటావయ్యా సబ్బు నాలుగు రూపాయల చిల్లరంటావ్..సినిమావాళ్లని చూస్తే రెండు రెండ్రూపాయల సబ్బుని నాలుగు రూపాయలంటావ్... అదీ అల్లు రామలింగయ్య ని చూస్తే పదన్నా అంటావ్ అన్నారు.  

ఆ మాటలకు షాపు వాడితో సహా అందరూ రామలింగయ్య ని  చూసి గుర్తు పట్టడమేంటి...చుట్టు ముట్టేసారు. దాంతో రామలింగయ్య అబ్బబ్బ ఈ జనం సబ్బు కూడా కొనుక్కోనివ్వరు కదా అని  పరుగెత్తుకొచ్చి కారెక్కేసారు. ఈ సంఘటన ఆ విలేఖరి తర్వాత ఓ పేపరు కు రాసారు. 1984 లో ఈ సంఘటన జరిగింది. అప్పుడు ఆయన మంచి ఫామ్ లో ఉన్నారు.  

ప్రారంభ రోజుల్లో చిన్న చిన్న  బిట్ రోల్స్ లో అలరించిన అల్లు, ఆ తరువాత ఎన్నో వందల చిత్రాల్లో తన హాస్యంతో నటవిశ్వరూపం చూపించారు... కామెడీనే కాకుండా సెంటిమెంట్, విలనీ కూడా అల్లువారు పండించిన తీరు జనాన్ని విశేషంగా అలరించింది. ఓ టైమ్ లో ఆయన లేని సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు.  అల్లు రామలింగయ్య ఏది చేసినా, ఎలా మాట్లాడినా,  అది నవ్వులు పూయించడం రివాజయింది... అదే ఎన్నో చిత్రాలకు సక్సెస్ ఫార్ములాగా మారింది.