అల వైకుంఠపురములో హిట్ ఇచ్చిన కిక్ లో ఉషారుగా ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. సుక్కు సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారేందుకు ప్రస్తుతం బన్నీ కసరత్తులు చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. అయితే అదే సమయంలో ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్‌కు కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వస్తున్నాయి. దర్బార్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మురగదాస్, రీసెంట్ గా బన్నీని కలిసి ఓ కథను చెప్పారట. దాన్ని విన్న వెంటనే ఓకే చెప్పిన బన్నీ, ఫుల్ స్క్రిప్ట్‌తో రావాలని కోరారట. అయితే ఇంతకీ మురగదాస్ చెప్పిన కథ ఏమిటి అంటే ..గజనీ సీక్వెల్ అని తెలుస్తోంది.

ఈ మేరకు `గ‌జిని2` అనే టైటిల్ ఫిల్మ్  ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ అయింది. గీతాఆర్ట్స్ రిజిస్ట‌ర్ చేయించటంతో ఇదే ప్రాజెక్టు కోసం అని అందరూ ఫిక్సైపోతున్నారు. `గ‌జిని`ని మురుగ‌దాసే తెర‌కెక్కించి..తెలుగులో,తమిళ భాషల్లో సూపర్ హిట్ కొట్టారు. దాన్ని హిందీలో అమీర్ ఖాన్ తో  రీమేక్ చేసి ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది గీతాఆర్ట్స్‌. ఇప్పుడు `గ‌జిని2`ని కూడా తీసి, దాంతో అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాల‌నేది అల్లు అరవింద్ ఆలోచ‌న‌గా చెప్తున్నారు. మురుగ‌దాస్ కూడా `గ‌జిని2`అయితే అల్లు అర్జున్‌ సెట్ అవుతుందని బాగుంటుంద‌ని భావించాడ‌ట‌. దాంతో ఆ క‌థ‌పై ఆయ‌న ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. తెలుగులో స్ట్రైయిట్ సినిమాల పరంగా మురగదాస్‌కు బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. తెలుగు స్టార్స్  అయిన చిరంజీవి, మహేష్ బాబులతో ఇప్పటివరకు సినిమాలను తీశారు మురగదాస్. స్టాలిన్, స్పైడర్ టైటిల్స్ తో తెరకెక్కిన  ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కానీ ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బన్నీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. కేవలం కథపై, మురగదాస్‌ మేకింగ్ పై నమ్మకం తో బన్నీ..  ఈ చిత్రంలో నటిస్తానని ఆయనకు హామీ ఇచ్చారట బన్నీ. తమిళ సినిమా వర్గాల నుంచి వినపడుతున్న దాన్ని బట్టి ఈ కాంబినేషన్ అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.