స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. అదిరిపోయే సాంగ్స్ తో సందడి ప్రారంభించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఆన్లైన్ లో దుమ్మురేపుతున్నాయి. 

టీజర్ కోసం బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఆ ముచ్చట కూడా తీర్చేసింది. సూపర్ స్టైలిష్ గా కట్ చేసిన టీజర్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. గట్టిగా అరుపులు, కేకలు లేవు.. సింపుల్ గా త్రివిక్రమ్ పదునైన మాటలతో బన్నీ అదరగొట్టేశాడు. అభిమానులకు అల వైకుంఠపురములో టీజర్ చిన్నపాటి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. 

'మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్లు దాచాడు నిన్ను.. సరిగ్గా చూడలేదు ఎప్పుడూ.. ముందుకి రా' అంటూ బ్యాగ్రౌండ్ లో వినిపించే ఆసక్తికరమైన డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. అల్లు అర్జున్ లిఫ్ట్ లో నుంచి స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత కొన్ని పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ని చూపిస్తారు. 'స్టైల్ గా ఉంది కదూ.. నాక్కూడా నచ్చింది' అని బన్నీ తన గురించి తానే ఓ డైలాగ్ చెబుతాడు. 

ఇక హీరోయిన్ పూజా హెగ్డే టీజర్ లో గ్లామరస్ గా కనిపిస్తోంది. ఇక టీజర్ చివర్లో అల్లు అర్జున్.. సముద్రఖని తో చెప్పే డైలాగ్ హైలైట్. 'మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా' అని బన్నీ చెప్పే డైలాగ్ త్రివిక్రమ్ మార్క్ పంచ్ ని గుర్తుకు చేసే విధంగా ఉంది. ఓవరాల్ గా అల వైకుంఠపురములో టీజర్ అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు.