స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సుశాంత్, నవదీప్, నివేతా పేతురాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు.

టైటిల్ టీజర్ ని ముందుగా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత  'సామజవరగమన', 'రాములో రాములా' పాటలు అంచనాలకి మించి హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో ఈ పాటలు రికార్డులు సృష్టించాయి.

రీసెంట్ గా ఈ సినిమా నుండి మూడో పాట వచ్చింది. అదే 'ఓ మై గాడ్‌ డాడీ'. ఈ పాట కూడా ఆడియన్స్ ని మెప్పించింది. ఇప్పుడు అభిమానుల జోష్ మరింత పెంచడానికి సినిమా టీజర్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ నెల 11న టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలో ఫ్యాన్స్ ని త్రిల్ చేయడానికి టీజర్ ఎలా ఉండబోతుందో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ స్టైల్ గా లిఫ్ట్ నుండి బయటకి వచ్చి టేబుల్ పైకి ఎక్కి నడుస్తూ కనిపిస్తాడు. ఇందులో అల్లు అర్జున్ ని చూపించకుండా అతడి స్టైల్ ని మాత్రమే ఫోకస్ చేశారు.

ఈ గ్లిమ్ప్స్ లో కమెడియన్ సునీల్ తలుక్కున మెరిశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి వస్తోన్న బజ్ చూస్తుంటే అల్లు అర్జున్ ఓపెనింగ్స్ తో రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు.