ఈ ఏడాది జనవరిలోనే అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌.  ఈ సినిమా తరువాత  షార్ట్ గ్యాప్ తీసుకున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ సినిమాతో  తెరకెక్కబోయే పుష్ప సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ రోజు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. రఫ్‌ లుక్‌లో ఉన్న బన్నీ లుక్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది.

ఈ సినిమాతో పాటు మరో సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చాడు బన్నీ. చాలా రోజులుగా చర్చల దశలో ఉన్న మరో సినిమా ఐకాన్‌ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు బన్నీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా  సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు బన్నీ. కానీ ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అదే సమయంలో సుకుమార్ సినిమా ఒకే కావటంతో ఐకాన్‌ను పక్కన పెట్టేశాడు బన్నీ.

ఈ గ్యాప్‌లో వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్‌ ప్రారంభించాడు. వకీల్‌ సాబ్ పేరుతో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో మరోసారి ఐకాన్‌ సినిమా తెర మీదకు వచ్చింది. తాజాగా బన్నీ బర్త్‌ డే సందర్భంగా ఐకాన్‌ టీం విషెస్‌ చెబుతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దీంతో బన్నీ నెక్ట్స్ సినిమా ఐకాన్ అని ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌.