ఏడాది మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్‌. ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు బన్నీ. అదే జోరులో నెక్ట్స్ సినిమాను కూడా ప్రారంభించాడు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్‌. గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ పక్కా మాస్ లుక్‌లో అలరించనున్నాడు. చాలా రోజులు క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

బన్నీ లేని సీన్స్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ లోగా కరోనా లాక్‌ డౌన్‌ రావటంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో చిత్ర యూనిట్ కథా కథనాలకు మరింతగా మెరుగు పెట్టే పనిలో ఉన్నారు. తాజాగా బన్నీ కాస్ట్యూమ్స్‌కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.

అందులో భాగంగా సినిమాలో బన్నీ వినియోగించబోయే కాస్ట్యూమ్స్‌ను రెండు రోజుల పాటు కాఫీలో నానబెట్టి తరువాత ఉతికి ఆరబెడుతున్నారట. ఓల్డ్‌ లుక్‌ కోసం ఇలా చేస్తున్నారట. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మరో కీలక పాత్రలో కోలీవుడ్ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడన్న టాక్ వినిపించినా ప్రస్తుతం డేట్ల సమస్య రావటంతో విజయ్ తప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.