స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంలో శుభారంభం చేశాడు. అల వైకుంఠపురములో చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో బాహుబలి తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్నాడు. 

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నేడు అల్లు అర్జున్ 37వ జన్మదిన వేడుక జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజగా ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేసింది. ఈ చిత్రానికి 'పుష్ప' అనే టైటిల్ ఖరారు చేశారు. 

ఇక బన్నీ లుక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బన్నీ తన కెరీర్ లో మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఒక రకంగా చూస్తే కరుడుకట్టిన క్రిమినల్ ఎలా ఉంటాడో అలా ఉన్నాడు బన్నీ. గుబురుగా ఉన్న హెయిర్, గడ్డం, మేడలో తాయత్తు.. వీటన్నింటికి మించి భయంకరంగా బన్నీ చూస్తున్న చూపు.. తీక్షణంగా చూస్తే బన్నీ లుక్ గగుర్పాటుకు గురిచేసేలా ఉంది. 

 

మొత్తంగా సుకుమార్ రంగస్థలం తర్వాత మరో భారీ ప్రయోగానికే శ్రీకారం చుట్టారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నట్లు టాక్. కాబట్టి బన్నీ ఇలా కనిపిస్తేనే బావుంటుందని సుకుమార్ డిసైడ్ అయ్యారు. మొత్తంగా సినిమాపై అంచనాలు పెంచే విధంగా పుష్ప లుక్ ఉంది. 

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.