ప్రముఖ జర్నలిస్ట్ వినాయకరావు.. మెగాస్టార్ చిరంజీవి జీవితంపై ఓ పుస్తకం రాశారు. ఈ బుక్ లాంచ్ కి రామ్ చరణ్, అల్లు అరవింద్ లాంటి వాళ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అరవింద్.. చిరంజీవిని ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

చిరంజీవి గారి సినీ ప్రస్థానం, ఆయన గురించి మీకు తెలియని విషయాలు అంటూ ఏవీలేవు అంటూ చెప్పిన ఆయన... నలభై ఏళ్లుగా ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నానని.. బావమరిదిగా కంటే మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పారు. ఇద్దరిదీ ఎమోషనల్ జర్నీ అని అన్నారు.

ఇష్క్ బ్యూటీ బొద్దుగా ఉన్నా అందమే (ఫొటోస్)

మరిన్ని విషయాలు చెబుతూ.. ''1995, 96 సమయంలో చిరంజీవి పుట్టినరోజు నాడు ఆయన అభిమానులు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి వెళ్లి.. బ్లడ్ డొనేట్ చేసి తిరిగి వస్తోన్న సమయంలో చిరంజీవి గారు.. మన ఫ్యాన్స్ అందరినీ సమాజానికి ఉపయోగపడేలా ఓ తాటి మీదకి తీసుకొస్తే బాగుంటుందని అన్నారు. బ్లడ్ బ్యాంక్ పెట్టి.. కోట్ల రూపాయలు వెచ్చించి.. మ్యానేజింగ్ ట్రస్టీగా నన్ను నియమించి ఇప్పటికీ మైంటైన్ చేస్తున్నారు. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి'' అంటూ చెప్పుకొచ్చారు.  

ఆయన చాలా మంచి వ్యక్తి అని.. రాజకీయాల్లో ఉన్నాం కదా.. ఇంత మంచితనం పనికిరాదని అప్పట్లో చిరంజీవికి చెబితే..  రాజకీయం అనేది పని.. అంటే అదొక వృత్తి.. మంచితనం అనేది నా ప్రవృత్తి.. వృత్తి గురించి ప్రవృత్తిని మార్చుకోలేను.. ఇలానే ఉంటానని ఆయన చెప్పారని.. అలాంటి వ్యక్తితో ప్రయాణం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.