స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అల వైకుంఠపురములో చిత్రంతో బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శత్వంలో పుష్ప అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. 

లాక్ డౌన్ కారణంగా పుష్ప చిత్ర షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొరటాల శివ.. దర్శకుడిగా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నారు. కొరటాల శివకు డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే చిత్రంతెరకెక్కిస్తున్నాడు. 

తాజాగా అల్లు అర్జున్, కొరటాల శివ కాంబో గురించి ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీతో సినిమా చేసేందుకు కొరటాలకు అల్లు అరవింద్ 13 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బన్నీ, కొరటాల మధ్య ప్రాధమిక చర్చలు మొదలయ్యాయట. లాక్ డౌన్ లోనే కొరటాల బన్నీకి స్టోరీ లైన్ వినిపించారట. బన్నీ కూడా ఆ లైన్ పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆచార్య ఓ కొలిక్కి వస్తే బన్నీ, కొరటాల కాంబో గురించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.