కరోనా నేపధ్యంలో సినిమాల రిలీజ్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.  అల్లు అరవింద్‌ మాట్లాడుతూ పెద్ద సినిమాలు ఒక మోస్తరు బడ్జెట్‌ సినిమాలు ఈ ఏడాదిలో విడుదల అనుమానమే అంటున్నారు.అసలు ఈ ఏడాదిలో థియేటర్లు ఓపెన్‌ అవ్వడమే కష్టం అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు.దసరా వరకు పరిస్థితి యదాస్థితికి వస్తుందని కొందరు భావిస్తుంటే అల్లు అరవింద్‌ మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతవరకూ బాగానే ఉంది ఆయన అభిప్రాయం చెప్పారు. అయితే అదే సమయంలో తన ఓటీటీ ఆహా కు సినిమాలను పోగేయటం మొదలెట్టారని సమాచారం.

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టే వరకు సినిమా పరిశ్రమ కోలుకోవడం కష్టం అనే అభిప్రాయం చెప్పాక, ఆయన ఇప్పటికే సినిమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు ఎదురుచూస్తున్న చిన్న నిర్మాతల లిస్ట్ రెడీ చేసారట. వారితో డైరక్ట్ డిస్కషన్స్ మొదలెట్టారట. అనవసరంగా వడ్డీలు కడుతూ రిలీజ్ కోసం  వెయిట్ చెయ్యిటం ఎందుకు..మా ప్లాట్ ఫామ్ లో మీ సినిమాలు రిలీజ్ చేసుకోండి. మేము సపోర్ట్ చేస్తాం. మీ సినిమాలో సత్తా ఉంటే ఖచ్చితంగా చాలా మంది మీ సినిమాని చూస్తారు. మీకు ప్రాఫిట్ షేరింగ్ ద్వారా మంచి లాభాలు వస్తాయని చెప్తున్నారట. అయితే ఇంత రేటు అని చెప్పి డిజిటల్ రైట్స్ మాత్రం తీసుకోవటానికి ఆసక్తి చూపటం లేదట. ఆయన తనకున్న పరిచయాలతో ఇలా అందరితో ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు వినిపిస్తోంది. కొంతమంది ఇప్పటికే ఓకే చెప్పినట్లు సమాచారం. మరికొంతమంది మాత్రం కాస్త టైమ్ ఇవ్వమని, ఆలోచించుకుని చెప్తామని చెప్పారట. 

ఆహాకు ఇచ్చేబదులు..ఆల్రెడీ ఫామ్ లో ఉన్న అమెజాన్ ప్రైమ్,నెట్ ఫ్లిక్స్ కు ఇస్తే బెస్ట్ కదా ,రెవిన్యూ బాగా వస్తుంది. ఇక్కడ అరవింద్ ..ఓటీటి అయిన ఆహా ఇంకా జనాల్లోకి పూర్తిగా వెళ్లలేదు కదా...చూసేవాళ్లు తక్కువ మంది ఉంటారు అని భావిస్తున్నారట. అదీ నిజమే. ఇంత రేటు ని ఫిక్స్ చేస్తే ఆహా కు సినిమాలు జమ అవుతాయి. అంతేకానీ ఇలా ఆల్రెడీ ఫామ్ లో ఉన్న ఓటీటీల స్కీమ్ లే ఇక్కడా తెచ్చిపెడతానంటే ఎలా..ఇది ఓ మామూలు సగటు నిర్మాత ఆలోచన. అయితే అల్లు అరవింద్ వంటి పెద్ద నిర్మాతను కాదని తమ సినిమాను తర్వాత అయినా రిలీజ్ చేసుకోగలమా...ఇండస్ట్రీలో మనగలమా...అనేది ఓ ప్రక్కన నిర్మాతల్లో భయం మొదలైంది. 
 
ఆహా విషయానికి వస్తే.. ఇప్పటికే ‘కొత్త పోరడు’ ‘సిన్’ వంటి వెబ్ సిరీస్ లకు మంచి రెస్పాన్స్  లభించింది. ఇక ‘సవారి’ ‘ఖైదీ’ ‘అర్జున్ సురవరం’ వంటి సినిమాలను కూడా కొనుగోలు చేసారు. ఫిబ్రవరి లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రాన్ని కూడా కొనుగోలు చేసారు.త్వరలోనే ఈ చిత్రం ఆహా లో ప్రత్యక్షం కానుంది. ఈ చిత్రం కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు ఇప్పుడున్న పరిస్దితుల్లో  విడుదలకు నోచుకోని చిన్న సినిమాలను సైతం… అందులోనూ కంటెంట్ బాగున్న సినిమాలను… డైరెక్ట్ గా ఆహా లో స్ట్రీమింగ్ చెయ్యటానికి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్లు సమాచారం.