నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 నేడు గ్రాండ్ ఫినాలే తో ముగియనుంది. ఆదివారం రోజు ఫైనల్ ఎపిసోడ్ ని ప్రదర్శించనున్నారు. ఈ ఎపిసోడ్ తో ఫైనల్ కు చేరుకున్న ఐదుగురిలో విజేత ఎవరనేది తేలిపోనుంది. బిగ్ బాస్ 3లో శ్రీముఖి, రాహుల్, అలీ, బాబా భాస్కర్, వరుణ్ ఫైనల్ కు చేరారు. 

వీరిమధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. కానీ సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూస్తుంటే శ్రీముఖి, రాహుల్, బాబా టైటిల్ బరిలో ముందున్నట్లు తెలుస్తోంది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇంతవరకు మహిళలు టైటిల్ గెలుచుకోలేదు. ఎలాగైనా బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ ఎగరేసుకుపోవాలని ఈ సీజన్ మొత్తం ఒక స్ట్రాటజీతో శ్రీముఖి గేమ్ ఆడుతూ వచ్చింది. మరి ఆమె పంతం నెగ్గుతుందో లేదో చూడాలి. 

ఇక ఆరంభంలో తడబడ్డా చివరికి చేరుకునే సరికి రాహుల్ బాగా పుంజుకున్నాడు. ఏకంగా శ్రీముఖికి పోటీగా నిలిచాడు. రాహుల్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ నెంబర్ 1 ఎంటర్టైనర్ గా కొనసాగుతున్నారు. ఆయన్ని అభిమానించే ప్రేక్షకులు కూడా భారీగానే ఉన్నారు. 

వరుణ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఇమేజ్ సొంతం చేసుకున్నప్పటికీ వరుణ్ టైటిల్ గెలుచుంటాడా అనేది సందేహంగా మారింది. ఇక అలీ రెజా ఎలిమినేట్ అయ్యాక తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. దీనితో అలీ టైటిల్ రేసులో వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 

బిగ్ బాస్ 3 గురించి మాట్లాడాలంటే కింగ్ నాగార్జున గురించి తప్పకుండా ప్రస్తావించాల్సిందే. నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారనేది తెలియగానే భారీ హైప్ వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగానే నాగ్ తన హోస్టింగ్ తో అదరగొట్టాడు. తనదైన శైలిలో పంచ్ లు, జోకులు వేస్తూనే అవసరమైనప్పుడు కంటెస్టెంట్స్ కు చివాట్లు పెట్టాడు. 

నేడు జరగబోయే ఫైనల్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వినోదాత్మక కార్యక్రమాలతో అలరించనున్నారు. కొంతమంది ప్రముఖ హీరోయిన్లు అతిథులుగా హాజరు కాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.