భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళంక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. సినిమాకి అనుకున్నంతగా కలెక్షన్స్  రాకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు సినిమాలో నటించిన కథానాయిక అలియా భట్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. అంతే కాకుండా ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ రణ్ బీర్ మద్దతుతో కోలుకున్నట్లు చెప్పింది.

వరుణ్ ధావన్ - సంజయ్ దత్ - మాధురి దీక్షిత్ - సోనాక్షి సిన్హా తో పాటు అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన కళంక్ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 17న రిలీజైన ఆ సినిమా అనుకున్నంతగా లాభాలని అందించలేదు. 100కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడంతో మనోవేదనకు లోనయినట్లు చెబుతూ.. ఆ సమయంలో రణ్ బీర్ తన మాటలతో ధైర్యాన్ని ఇచ్చినట్లు అలియా తెలిపారు.

 'నీ శక్తి ఉన్నంతలో నువ్ న్యాయంగా కష్టపడ్డావు, అప్పుడే సక్సెస్ అందకపోవచ్చు. ఫలితాలు దక్కకపోయినా కష్టపడే యాక్టర్స్ గా నీ కష్టం  వృధా కాదు. మరో సినిమా రూపంలో పాజిటివ్ రిజల్ట్ గా కనిపిస్తుందని రణబీర్‌ తనలో ఎంతో ధైర్యం నింపాడు' అని అలియా ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అలియా బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ పాన్ ఇండియన్ మూవీ RRR లో కూడా నటిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లు కథానాయకులుగా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది.