వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఒకే తేదీకి విడుదలవుతున్నాయి. చడీచప్పుడు లేకుండా అల్లు అర్జున్ తన 'అల వైకుంఠపురములో' సినిమా రిలీజ్ పోస్టర్ వదిలాడు. ఇక అదే ఈరోజు జనవరి 11న తన సినిమా కూడా రిలీజ్ ఉంటుందని మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ తో పాటు బయ్యర్లు అయోమయంలో పడ్డారు.

అయితే ఈ విషయంలో మహేష్ బాబు పంతమే కారణమని అంటున్నారు. హారికా హాసిని సంస్థ తమ సినిమా 'అల వైకుంఠపురములో' సినిమా మహేష్ సినిమాకు ఒకరోజు వెనుకగా రిలీజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని దిల్ రాజుకి చెప్పారు. దిల్ రాజు ఈ విషయాన్ని మహేష్ దృష్టికి పంపించగా.. మహేష్ దానికి అంగీకరించలేదట. తాము 11న వస్తామని, మూడు రోజులు గ్యాప్ ఇచ్చి 14న 'అల వైకుంఠపురములో' సినిమా రిలీజ్ చేసుకోవాలని కబురు పంపించారట.

దానికి హారిక హాసిని సంస్థ అంగీకరించలేదు. 14న వస్తే కీలకమైన రెండు రోజుల ఓపెనింగ్స్ పోతాయి కాబట్టి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఏపీలో పండగకు రెండు రోజుల  ముందు నుండే సినిమాల హడావిడి మొదలవుతుంది. అందుకే 12న రిలీజ్ పెట్టుకుంటామని, ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఇస్తామని హారిక హాసిని సంస్థ తేల్చి చెప్పిందట. దాంతో ఆ మాటకు మహేష్ బాబు హర్ట్ అయ్యారట. 

ఆ గ్యాప్ కూడా అవసరం లేదని, వాళ్లు ఏరోజైతే రిలీజ్ డేట్ ఇస్తారో అదే రోజు తన సినిమా కూడా రిలీజ్ అవ్వాలని మహేష్ చెప్పేశారట. ఈ విషయంలో దిల్ రాజు కూడా ఏం చేయలేకపోయారట. ఇంతలో 'వెంకీ మామ' మధ్యలో ఎంట్రీ ఇచ్చి జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు సురేష్ బాబు తన డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడారట. విషయం బయటకి పొక్కడంతో బన్నీ అండ్ టీం తమ సినిమా ముందే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యి జనవరి 11న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశారు.

ఇక మహేష్ కూడా అదే రోజు రానున్నట్లు తేల్చేశారు. ఈ విషయంలో మహేష్ బాబు పంతానికి పోయారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా హీరోలు బాగానే వుంటారని, నిర్మాతలు, బయ్యర్లు నష్టపోతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మూడు సినిమాలతో పాటు రజినీకాంత్ 'దర్బార్' సినిమా కూడా రాబోతుంది. మరి సంక్రాంతి రేసులో గెలిచేదెవరో చూడాలి!