వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతోంది. రాజకీయ ప్రముఖులు, చిత్ర పరిశ్రమ సెలెబ్రిటీలు, మహిళా సంఘాలు ఈ క్రూరమైన చర్యని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. బుధవారం రాత్రి శంషాబాద్ సమీపంలో ప్రియాంక ఒంటరిగా కనిపించడంతో నలుగురు వ్యక్తులు ప్రియాంకపై అత్యాచారానికి తెగబడ్డారు. 

ఆపై ప్రియాంకని సజీవదహనం చేసి క్రూరంగా హత్య చేశారు. ప్రియాంక అదృశ్యమైనట్లు కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రియాంక తన సోదరితో మాట్లాడిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

చివరకు ప్రియాంకని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా పోలీసులు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిందితులకు ఖఠినమైన శిక్ష విధించాలి అంటూ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా గళం వినిపిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి, తమిళనాడులో రోజా, రాంచిలో రేప్ కి గురైన స్టూడెంట్.. ఇదంతా చూస్తుంటే సమాజాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. మాకు కఠినమైన చట్టాలు కావాలి'' అంటూ రాసుకొచ్చారు.

''ప్రియాంక రెడ్డికి జరిగిన ఘటన మన సమాజం ఎంత అసురక్షితంగా ఉండడానికి మనమే అనుమతించామనే విషయాన్ని గుర్తు చేస్తుంది. సరైన న్యాయాన్ని అందించడం విఫలమవుతున్నాం'' అంటూ ఫర్హాన్ అక్తర్ అన్నారు. ''సహాయం చేస్తామని ముందుకు వచ్చిన మనుషుల్ని నమ్మడమే ప్రియాంక చేసిన నేరమా'' అంటూ నటి రిచా చద్దా ప్రశ్నించింది.