కరోనా ప్రభావం సినీ రంగం మీద చాలా ఎక్కువగా ఉంది. సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నెలరోజులుగా ఆగిపోయాయి. షూటింగ్‌లు, నిర్మాణానంతర కార్యక్రమాలతో పాటు ఇప్పటికే పూర్తయిన సినిమాల రిలీజ్‌లు కూడా వాయిదా పడ్డాయి. దీంతో సినీ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే పరిస్థితి కూడా కనిపించటం లేదు. దీంతో నిర్మాతలు పూర్తయిన సినిమాల విషయంలో రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తెలుగులో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న అమృతారామమ్ అనే సినిమాను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్ హీరో సినిమా విషయంలో కూడా చిత్రయూనిట్ ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

సౌత్‌లో సూపర్‌ హిట్ అయిన హర్రర్‌ మూవీ కాంచనా 2ను హిందీలో లక్ష్మీ బాంబ్‌ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో హీరోగా నటించి దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ హిందీ వర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. అక్షయ్‌ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాను రంజాన్ సందర్భంగా మే 22న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఈ లోగా పరిస్థితులు మారిపోవటంతో రిలీజ్ చేసే పరిస్థితి లేదు. దీంతో నిర్మాతలు డిస్నీ - హాట్‌ స్టార్‌లలో డైరెక్ట్‌గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా ఆన్‌లైన్ లో రిలీజ్ చేయటం దాదాపు ఖాయం అని తెలుస్తోంది.