కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే దాదాపు ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారి గుప్పిట్లో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కరోనా కారణంగా కుదేలయిపోయాయి. మనదేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించటంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి.

అదే బాటలో పలువురు సెలబ్రిటీలు కూడా తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా ఏకంగా 25 కోట్ల విరాళం ప్రకటించి అందరికంటే టాప్‌ లో నిలిచాడు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌. అయితే అక్షయ్ సాయం అక్కడితో ఆగిపోలేదు. తరువాత ముంబైలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల, వైధ్య సిబ్బంది కోసం మరో 3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.

తాజాగా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు అక్షయ్‌. తమ  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధుల్లో కొనసాగుతున్న పోలీసు అధికారుల కోసం మరోసారి విరాళం ప్రకటించాడు అక్షయ్‌. తాజాగా 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు అక్షయ్‌, దీంతో మొత్తంగా కరోనా నేపథ్యంలో 30 కోట్ల రూపాయలు ఇచ్చాడు అక్షయ్‌ కుమార్. దీంతో అభిమానులు అక్షయ్‌ ని చూసి గర్వపడుతున్నారు. మరే హీరో ఇవ్వని విధంగా ఏకంగా 30 కోట్ల విరాళం ఇచ్చిన అక్షయ్‌ పెద్ద మనసు చూసి నువ్వు దేవుడివి సామి అనుకుంటున్నారు ఫ్యాన్స్‌.