అక్కినేని నాగేశ్వరరావు గారు మహానటుడు. ఆయన కూడా ప్రారంభం రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. ముఖ్యంగా నాటకాల్లో ఆడ పాత్రలకు అలవాటు పడి సినిమాల్లో ఆ ఆడంగి తనం తొంగి చూడకుండా ఉండటానికి కష్టపడ్డారు. వాటిని ఆయన ఓ సారి కినిమా పత్రికతో  నా తొలి సినిమా అనుభవం పేరిట పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..

"నేను నా 12 వ యే నుంచీ స్టేజీ మీద అనేక పాత్రలు నూటికి తొంభై తొమ్మిది పాళ్లు స్త్రీ పాత్రలు ధరిస్తూండటం చూసి నా అన్న అక్కినేని రామ బ్రహ్మం గారు నన్ను ఎట్లాగైనా సినిమాల్లో ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. డైరక్టర్ల చుట్టూ తిరిగాను. డబ్బు చాలా ఖర్చు చేసాను. ఆ ప్రయత్నాల ఫలితంగానే నాకు 1938లో ధర్మపత్నిలో నటించే అవకాసం లభించింది. కానీ అది చాలా చాలా చిన్న పాత్ర. తిరిగి 1940లో నాకు మరొక సినిమా అవకాశం లభించింది. అది శ్రీ రాజేశ్వరీ వారి తల్లి ప్రేమ సినిమాలో. దాని కోసం నేను మద్రాసు వచ్చాను. అయిదు మాసాలు ఉన్నాను. డబ్బు కూడా పుచ్చుకున్నాను. కానీ వేషం రాలేదు.

దీంతో నాకు సినిమాలంటే విసుగు, విరక్తీ కలిగింది. తిరిగి నా ఆడ వేషాలు వేయటం ప్రారంభించాను. అప్పట్లో అన్నపూర్ణ పిక్చర్స్ మేనేజింగ్ డైరక్టర్  మధుసూదనరావు గారు. అప్పటికే అనేక చిత్రాల్లో నటిస్తున్న  శ్రీ కోడూరి అచ్చయ్య గార్ల ఆధ్వర్యం  క్రింద ఉన్న ముదినేపల్లి ఎక్సెల్షియర్ డ్రమెటిక్ ఎసోసియోషన్ లో ప్రధాన పాత్రకు అవకాసం దొరికింది. వారి ద్వారానే ఎంతో అనుభవం సంపాదించాను. దాదాపు మూడు సంవత్సరాలు ఆ సంస్దలోనే ఉన్నాను.  

ఆ రోజుల్లోనే, అంటే 1944లో ఘంటసాల బలరామయ్యగారు సినిమా రంగంలో వారి సీతారామ జననంలో రామ పాత్రతో పరిచయం చేసారు. ఇదే నా నిజమైన సినిమా ప్రవేశం. తొలి అనుభవం మాట అడక్కండి.  ఎనిమిదేళ్లు స్త్రీ పాత్రలు ధరించిన నాకు నాతోనే మూగ యుద్దం. గొంతూ, ఉచ్చారణ మార్చుకోవాల్సి వచ్చింది. నడక మార్చుకోవాల్సి వచ్చింది. ఏ మాత్రం ఏమరుపాటు ఉన్నా ఆడతనం వచ్చేసేది. ఈ సంఘర్షణలో అయిదారు చిత్తరాలు అయ్యేదాకా మధన పడ్డాను. నిర్మొహమాటంగా విమర్శించే మిత్రులూ, నా అదృష్ణమూ కూడా నా సంఘర్షణకు ఎంతో సహాయపడిడ్డట్లే, నేను ముందడగు ఇంతవరకూ  వేయగలిగాను. ఇక ముందు కూడా వేయటానికి ప్రయత్నిస్తున్నాను. " అన్నారు.
 
(ఈ ఆర్టికల్ కినిమా పత్రికలో 1952లో ప్రచురితం అయ్యింది)