అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి మూడు చిత్రాలతో పరాజయాలు ఎదుర్కొన్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ అఖిల్ స్టార్ మెటీరియల్ అని, ఎప్పటికైనా టాలీవుడ్ లో అగ్ర నటుడిగా ఎదుగుతాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం అఖిల్ తన నాల్గవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దార్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అఖిల్ నటించిన తొలి చిత్రం 'అఖిల్' యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కింది. 

కానీ ఆ చిత్రం వర్కౌట్ కాలేదు. మరోసారి అఖిల్ యాక్షన్ చిత్రంలో నటించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు టాక్.  విశాల్ తో అభిమన్యుడు లాంటి యాక్షన్ థ్రిల్లర్ తో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో అఖిల్ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

పీఎస్ మిత్రన్ ప్రస్తుతం శివకార్తికేయన్ తో హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఇటీవల అఖిల్ వారిని తన ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించాడు. మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ కు అఖిల్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే అఖిల్ నటించబోయే ఐదవ చిత్రం ఇదే అని టాక్. 

తొలి చిత్రంతోనే యాక్షన్ మూవీ చేసి దెబ్బతిన్న అఖిల్ మరోమారు అలాంటి పొరపాటు చేస్తాడా అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. యాక్షన్ మూవీ హిట్ అయితే క్రేజ్ మాత్రం అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు.