అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఫస్ట్ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. లవ్ స్టోరీస్ తో అయినా హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు.

యూత్ ఫుల్ హీరోలందరు యూత్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఒక స్పెషల్ ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. కానీ అఖిల్ సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. హలో - మిస్టర్ మజ్ను సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ప్లాప్ దర్శకుడైన బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక ప్రయోగం చేయబోతున్నాడు. ఆ సినిమాలో ఉండే యూనిక్ పాయింట్ యూత్ ని టార్గెట్ చేస్తుందని సమాచారం.

ఇకపోతే అఖిల్ టైటిల్ పై చిత్ర యూనిట్ మంగళవారం క్లారిటి ఇవ్వనుంది. ఫిల్మ్ నగర్ నుంచి వస్తోన్న గాసిప్స్ ప్రకారం సినిమాకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఇక ఆ సినిమా అనంతరం అఖిల్ కోలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది.

విశాల్ తో అభిమన్యుడు అనే సినిమా చేసిన దర్శకుడు పిఎస్.మిత్రన్ ఇటీవల తమిళ్ లో 'హీరో' అనే సినిమా చేశాడు.  శివ కార్తికేయన్ ఆ సినిమాలో కథానాయకుడు. అయితే ఆ సినిమా అనంతరం ఈ దర్శకుడు అఖిల్ తో ఒక ఫాంటసీ ఫిల్మ్ ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అఖిల్.. దర్శకుడు పిఎస్.మిత్రన్ ని అలాగే హీరో శివకార్తికేయను కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడు మిత్రన్ కొత్త కాన్సెప్ట్ ని అఖిల్ కి వివరించాడట. సినిమాలో అఖిల్ సూపర్ హీరో తరహాలో కనిపించే విధంగా ఒక ఫాంటసీ కథను డిజైన్ చేసుకున్నట్లు సమాచారం.