రీమేక్ ఎప్పుడూ సేఫే అని భావిస్తూంటారు నిర్మాతలు, హీరోలు. అయితే దర్శకులకు తమ టాలెంట్ పెద్దగా చూపించటానికి వీలుండదని వీటికి దూరంగా ఉంటూంటారు. కానీ హీరోలు మక్కువ చూపించే చిత్రాల రీమేక్ చేస్తే వెంటనే వారి డేట్స్ దొరుకుతాయి, బిజినెస్ పరంగానూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వరసగా రీమేక్ సీజన్ నడుస్తోంది. తన కెరీర్ లో రీమేక్ చేయటానికి ఇష్టపడని దిల్ రాజు సైతం జాను రీమేక్ చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీకు పింక్ రీమేక్ ని ఎంచుకున్నారు. ఈ నేపధ్యంలో వరస ఫ్లాఫుల్లో ఉన్న అక్కినేని అఖిల్ సైతం తన నెక్ట్స్ సినిమా కోసం రీమేక్ ని ఎంచుకున్నట్లు సమాచారం.

మనం సినిమాలో ఎంతో ప్రామిసింగ్ గా అనిపించి, ఇండస్ట్రీని షేక్ చేస్తాడని అందరూ అనుకునేలా చేసిన అఖిల్...ఆ తర్వాత తడబడ్డాడు. కెరీర్ లో బోల్తా పడ్డాడు.  వరస డిజాస్టర్స్ అతన్ని వెనక్కి నెట్టేసాయి. ఎంతో నమ్మకంతో చేసిన  హలో, mr. మజ్ను కూడా ప్లాప్స్ కావడంతో అఖిల్ పరిస్దితి అయోమయంలో పడింది. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్న సమయంలో గీతా ఆర్ట్స్ వారు ఆ భారం తమపై పెట్టుకున్నారు. బొమ్మరిల్లు వంటి హిట్ ఇచ్చిన భాస్కర్ తో అఖిల్ కాంబినేషన్ ని సెట్ చేసి ప్రాజెక్టు ప్రారంభించారు. ఎలాగైనా తన నాలుగో చిత్రంతోనైనా తన తొలి హిట్ ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న అఖిల్ సరే అన్నాడు.

తన నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచలర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో మొదలెట్టి ఫస్ట్ లుక్ సైతం వదిలారు.  ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానున్న నేపథ్యంలో తన తర్వాతి సినిమా ఏంటనే దానిపై ఇప్పటికే ఇండస్ట్రీలో రకరకాల టాపిక్ లు రన్ అవుతున్నాయి. అఖిల్ లో రిస్క్ చేసే ధైర్యం తగ్గి రీమేక్ అయినా సై అన్నట్లు చెప్తున్నారు.

అందుతున్న సమాచారం మేరకు అఖిల్ ను ఒక బాలీవుడ్ రీమేక్ కోసం ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఇటీవలే సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బదాయి హో చిత్ర రీమేక్ హక్కులను ఈ నిర్మాత దక్కించుకున్నాడు. హిందీలో ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, ఆ పాత్రకు అఖిల్ ను అనుకుంటున్నట్లు సమైాచారం.  మరి ఈ రీమేక్ కు అఖిల్ సరే అంటే ఏ మేరకు అతని కెరీర్ కు ఈ చిత్రం పనికి వస్తుందో చూడాలి.

ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘బదాయి హో’ చిత్రం గతేడాది అక్టోబర్‌లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహించారు. ఈ  హిందీ మూవీఘన విజయం సాధించి 200 క్రోర్స్ క్లబ్ లో చేరింది.