ఒక్కో సందర్భంలో హీరోలు చేసే సాహసాలు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా అవాక్కయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా అజిత్ లాంటి స్టార్ హీరోలు అభిమానులు ఇలాంటి సర్‌ప్రైజ్‌లు తరుచుగా ఇస్తుంటారు. అలాంటి సంఘటనే ఇటీవల ఒకటి జరిగింది. తాజాగా ఈ విషయం బయటకు రావటంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

శివ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలు చేసిన అజిత్ వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. తరువాత బాలీవుడ్‌ సూపర్‌ హిట్ పింక్‌ సినిమాను రీమేక్‌ చేసిన అజిత్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో హెచ్‌ వినోద్ దర్శకత్వంలో వాలిమై అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లాక్‌ డౌన్‌ ముందుకు వరకు హైదరాబాద్‌లోనే జరిగింది. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

అయితే ఈ చిత్రీకరణలో వాడిన బైక్‌ తనకు ఎంతో నచ్చటంతో ఆ బైక్‌ మీదే హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకు వెళ్లాడు అజిత్. అయితే అప్పట్లో ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా వెళ్లిపోయాడు అజిత్‌. కానీ తాజాగా ఆ జర్నీకి సంబంధించిన ఫోటోలు బయటకు రావటంతో అభిమానులు షాక్‌ అయ్యారు. దాదాపు 650 కిలో మీటర్లు అజిత్ బైక్‌ మీద ప్రయాణించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ ప్రయాణంలో కేవలం పెట్రోల్ కోసం, ఫుడ్ కోసం మాత్రమే రెండు మూడు సార్లు బ్రేక్‌ తీసుకున్నాడట అజిత్.

ఇక సెట్స్‌  మీద ఉన్న వాలిమై సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్‌. కానీ ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని కార్యక్రమాలు ఆగిపోవటంతో రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.