కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. గత నెల విజయ్ ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మాస్టర్ సినిమా షూటింగ్ స్పాట్ లోనే విచారణ జరిపి షూటింగ్ అనంతరం విజయ్ ఇంట్లో కూడా తనిఖిలు నిర్వహించారు. ఆ ఘటన తమిళనాడులో అందరిని షాక్ కి గురి చేసింది.

ఇక మరోసారి అధికారులు విజయ్ కి షాకిచ్చారు. నేడు చెన్నైలోని విజయ్ ఇంట్లో అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండు సార్లు విజయ్ ని విచారించిన అధికారులు మళ్ళీ టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ విజయ్ మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.  ఆ సినిమాకు సంబందించిన ఆడియో ఈవెంట్ పైనే అందరి చూపు మళ్ళింది. ఈ నెల 15న చెన్నై లో భారీగా ఈవెంట్ ని నిర్వహించనున్నారు. వేడుకలో విజయ్ ఏం మాట్లాడుతాడా అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

ఇన్కమ్ ట్యాక్స్ దాడుల తరువాత విజయ్ ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడింది లేదు.  దీంతో మాస్టర్ ఆడియో లాంచ్ లో విజయ్ ఎవరికీ కౌంటర్ ఇస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే వేడుకకి అభిమానులెవరికి ఎంట్రీ ఉండదట. భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా చిత్ర యూనిట్ కి ముందే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అందుకే సన్ టీవీలోనే ఈవెంట్ ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.