ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో అదే స్దాయిలో ఫేక్ న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో అతీతులేం కాదు. సోషల్‌ మీడియో వస్తున్న కొన్ని ఫేక్ పోస్టులను షేర్ చేసిన సెలబ్రిటీలు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు.

బాలీవుడ్ సీనియర్ స్టార్‌ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌ ఉంటారో అందరికీ తెలిసిందే. తన సినిమాల అప్‌ డేట్స్‌ తో పాటు సామాజిక పరిస్థితులపై అభిప్రాయాలు పాటు సోషల్ మీడియాలో తనకు ఇంట్రస్టింగ్ గా అనిపించిన అంశాలను కూడా షేర్ చేస్తుంటాడు అమితాబ్‌. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అమితాబ్ చేసే పోస్ట్‌ లు మిస్ ఫైర్‌ అవుతుంటాయి.

తాజాగా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మన దేశ ప్రధాని ఈ ఆదివారం అందరినీ దీపాలు వెలిగించాలని పిలుపు నిచ్చారు. ఆ పిలుపుతో  దేశ వ్యాప్తంగా ప్రజలంతా దీపాలు వెలిగించి తమ మద్దతు తెలిపారు. దేశ ప్రజలంతా మేమంతా ఒక్కటే అని చాటి చెప్పారు. ఈ సందర్భంగా అమితాబ్ షేర్ చేసిన ఓ పోస్ట్ విమర్శలకు కారణమైంది.

ఓ శాటిలైట్ చిత్రంలో ప్రపంచమంతా చీకటిగా ఉండగా ఇండియా మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అది ఫేక్‌ ఫోటో అని నెటిజెన్లు ఆడేసుకుంటున్నారు. అది ఒరిజినల్‌ ఫోటో కాదు అయినా అమితాబ్ షేర్ చేయటంతో సెలబ్రిటీలు కూడా ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించటంపై నెటిజెన్లు ఫైర్‌ అవుతున్నారు.

గతంలో కూడా అమితాబ్ ఇలాంటి పొరపాటే చేశాడు. జనతా కర్ఫ్యూ సందర్భంగా మోడీ బయటకు వచ్చి చప్పట్లు కొట్ట మన్న సందర్భంలో  కూడా చప్పట్లు కొట్టడం ద్వారా వచ్చే ప్రకంపనలతో వైరస్‌ చచ్చిపోతుందని ట్వీట్ చేసి నెటిజెన్ల ఆగ్రహానికి గురయ్యాడు బిగ్ బి.