కరోనా ప్రభావం ప్రపంచంలోని ప్రతీలోని ప్రతీ రంగం మీద పడింది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థే కుప్ప కూలే పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. నిత్యావసరాలకు సంబందించిన రంగాలతో పాటు వినోద పరిశ్రమ మీద కూడా కరోనా ప్రభావం గట్టిగానే పడింది. ఇప్పటికే సినిమాల షూటింగ్‌లు ఆగిపోయి 20 రోజులు అవుతోంది. రిలీజ్‌లు, ఇతర సినిమా కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. దీంతో సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.

అయితే ఈ ప్రభావం ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాతైనా ప్రజలు థియేటర్లకు వస్తారా..? వచ్చినా యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ అంశాల మీదే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలు కొన్ని చర్చలకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో లా కాకుండా ప్రతీ షోకు సగం టికెట్లు మాత్రమే అమ్మితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నారట. అలా అయితే ప్రేక్షకులకు మధ్య ఒకటి సీటు గ్యాప్ ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవచ్చని భావిస్తున్నారట.

అయితే అలా చేస్తే కలెక్షన్ల విషయంగా భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే రీజనల్‌ సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరుతున్న తరుణంలో ఇలా థియేటర్లలో సగం టికెట్ లు మాత్రమే అమ్మితే వసూళ్లు కూడా సగమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కొంత మంది మాత్రం తక్కువ టికెట్లు అమ్మినా పర్వాలేదని, గతంలోలా మళ్లీ సినిమాలు వందల రోజుల పాటు థియేటర్లలో ఉండే పరిస్థితి వస్తుందంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో అది సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి థియేటర్ల యాజమాన్యాలు.. సినీ నిర్మాతలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.