సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు అభిమానులకు మద్య దూరం తగ్గింది. ఫ్యాన్స్ తమ అభిమాన తారలతో సోషల్ మీడియాద్వారా టచ్ లో ఉంటున్నారు. మన తారలు కూడా తమకి సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు.

అయితే ఒక్కోసారి ఈ సోషల్ మీడియా వలన నటీనటులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల రష్మిక తనపై అసభ్యకర కామెంట్స్ చేసిన కొందరు నెటిజన్లపై మండిపడింది. తాజాగా నటి నివేదా థామస్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'జెంటిల్ మెన్' సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ నటిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ప్రస్తుతం నాని సరసన 'వి' అనే సినిమాలో నటిస్తోంది. అలానే తమిళంలో రజినీకాంత్ నటిస్తోన్న 'దర్బార్'లో అతడి కూతురిగా కనిపించనుంది. ఈ క్రమంలో కాసేపు ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో మాట్లాడాలనుకుంది. దీంతో ఇన్స్టాగ్రామ్ లో చాట్ సెషన్ లో పాల్గొంది. దాదాపు అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పుకొచ్చింది.

అయితే కొందరు ఆకతాయిలు మాత్రం తమ ప్రశ్నలతో నివేదాని ఇబ్బందిపెట్టారు. దీంతో ఆమె ఓ పోస్ట్ పెడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ముందుగా తనతో చాట్ చేసిన సమయాన్ని కేటాయించిన ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు చెప్పిన ఆమె.. ఫ్యాన్స్ అడిగిన ఫన్నీ ప్రశ్నలతో చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది.

కొందరు అడిగిన ప్రశ్నలను పట్టించుకోలేదని.. పెళ్లెప్పుడు..? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? నువ్ వర్జినేనా..? ఇలాంటి చెత్త ప్రశ్నలు అడిగారని.. వాటికి సమాధానాలు చెప్పలేదని వెల్లడింది. మీరు మాట్లాడేది కూడా ఓ మనిషితో అని, వారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోమని మండిపడింది.