చెన్నై: ప్రముఖ నటి వీజె చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆమె అభిమానులు షాక్ తిన్నారు. పాండ్యన్ స్టోర్స్ సిరీస్ ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. ఆ సీరియల్ విజయ్ టీవీలో ప్రసారమవుతోంది. ఈ సీరియల్ లో ఆమె ముల్లయ్ పాత్ర పోషించింది. 

డిప్రెషన్ కు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్్నారు. చెన్నైలోని నాజర్ పేటలో గల ఓ హోటల్ లో ఆమె ఉరివేసుకుని మరణించింది. ఆమెకు 28 ఏళ్లు. చెన్నైలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఇటీవలే ఆమెకు నిశ్చితార్థం జరిగింది.

వివిధ తమిళ టీవీ చానెల్స్ లో ప్రెజెంటర్ గా కూడా చిత్ర పనిచేశారు. ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమలో నటీనటులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.

ప్రాథమికంగా చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నప్పటికీ అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. మంగళవారం షూటింగ్ ముగిసిన తర్వాత చిత్ర హోటల్ కు వెళ్లినట్లు గుర్తించారు. చిత్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాను స్నానం చేస్తాననీ బయటకు వెళ్లాలనీ తనతో కలిసి ఉన్న వ్యక్తితో చెప్పినట్లు తెలుస్తోంది. అతను తిరిగి వచ్చేసరికి ఉరివేసుకుని మరణించినట్లు సమాచారం.