మీటూ ఉద్యమంలో భాగంగా బయటకి వచ్చి మాట్లాడుతున్న వారికి అవకాశాలు పోతున్నాయని నటి తమన్నా వెల్లడించింది. మీటూ అనేది ముందుగా హాలీవుడ్ లో మొదలై.. ఆ తరువాత మన దేశానికి కు వ్యాపించింది. బాలీవుడ్ లో ఈ ఉద్యమం ప్రకంపనలు సృష్టించింది. తనుశ్రీదత్తా దీనికోసం ఎంతగానో పోరాడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి. బాలీవుడ్ నుండి దక్షిణాదికి పాకిన మీటూ తెలుగులో కంటే కోలీవుడ్ లో చాలా ప్రభావం చూపించింది.

ప్రముఖ గీతరచయిత వైరముత్తుపై యువగాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చేసిన మీటూ ఆరోపణలు దుమారాన్ని రేపాయి. దర్శకుడు సుశీగణేష్, రాఘవ లారెన్స్, సీనియర్ నటుడు రాధారవి, అర్జున్ లాంటి వారు కూడా ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి సైతం మీటూ సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పి షాకిచ్చింది.

 

అయితే ప్రస్తుతం మీటూ ప్రకంపనలు బాగా తగ్గాయి. ఈ క్రమంలో నటి తమన్నా తాజాగా చేసిన కామెంట్స్ తో మీటూ మరోసారి చర్చకు వచ్చింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నాకి మీటూకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆమె సమాధానమిస్తూ.. తనకు ఇప్పటివరకు మీటూ సమస్య ఎదురుకాలేదని చెప్పింది. తాను ఎలా ప్రవర్తించాలో తనకు తెలుసునని చెప్పింది.

లైంగికపరమైన ఒత్తిళ్లు రాకపోవడం తన అదృష్టం కూడా కావొచ్చని పేర్కొంది. అయితే అత్యాచార ఒత్తిళ్లు ఎదుర్కొన్న మహిళలు బయటకి వచ్చి ధైర్యంగా మాట్లాడడం మంచిదేనని.. అయితే అలాంటి వారికి అవకాశాలు రాకపోవడం బాధగా ఉందని వెల్లడించింది. ఏదైనా ఒక విషయం మిమ్మల్ని బాధిస్తోందని భావిస్తే దాన్ని ఎదిరించి పోరాడాలని 

చెప్పింది.

అలా తాను కూర్చొని ఏడ్చే అమ్మాయిని కాదని చెప్పింది. తాను ఇన్నాళ్లు నటిగా నిలబడడానికి కారణం అనుకున్నది చేయగలగడమేనని వెల్లడించింది. ఇటీవల విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో తమన్నా కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విశాల్ తో ఓ యాక్షన్ ఫిలింలో నటిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.