ప్రముఖ సింగర్, నటి, రచయిత ఇలా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుచిత్రా కృష్ణమూర్తి.. 1997లో దర్శకుడు శేఖర్‌కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికో కూతురు కూడా ఉంది. ఆమె పేరు కావేరి. తను కూడా తల్లి మాదిరి మ్యూజిక్ రంగంలో సత్తా చాటుతోంది.

అయితే కొన్నేళ్లక్రితమే సుచిత్రా దంపతులు విడిపోయారు. ఆ తరువాత కూతురు కావేరితో కలిసి జీవిస్తోంది సుచిత్రా కృష్ణమూర్తి. ఇదిలా ఉండగా .. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న మూడు పడక గదుల ఫ్లాట్ లో నటుడు కబీర్ బేడి, భార్యతో కలిసి అద్దెకి ఉంటున్నారు.

అయితే ఈ ఫ్లాట్ తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్ కి చెందినదని.. చట్టప్రకారం ఇది తమ కుమార్తె కావేరికి చెందుతుందని సుచిత్రా వాదిస్తూ వచ్చారు. తన కూతురు ఉండడానికి ఇల్లు లేదని చెబుతున్నా.. నాలుగేళ్లుగా కబీర్ బేడి ఆ ఇంటిని ఖాళీ చేయడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక లాభం లేదనుకున్న ఆమె కోర్టుని ఆశ్రయించారు. మాజీ భర్త నుండి కూతురికి రావాల్సిన ఆస్తి కోసం న్యాయపోరాటానికి దిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. మున్ముందు తన కూతురికి ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

ఇప్పటికే దీని వలన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నానని , ఇంతకుమించి ఏమీ చెప్పలేదని మాట్లాడడానికి నిరాకరించారు. ఇక ఈ విషయంపై చాలాసార్లు శేఖర్ కపూర్ కి నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతోనే ఆమె కోర్టుని ఆశ్రయించారని సమాచారం.