ప్రస్తుతం తమిళనాడులో జయలలిత బయోపిక్ కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా పలువురు దర్శకులు చిత్రాలు తెరక్కిస్తున్నారు. అమ్మ అని తమిళులు ఆప్యాయంగా పిలుచుకునే జయలలిత జీవిత చరిత్రని వెండితెరపై ఏవిధంగా ఆవిష్కరించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. 

జయలలిత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, వివాదాలు ఉన్నాయి. అందుకే ఒక్క వ్యక్తి జీవిత చరిత్రపై నాలుగైదు బియోపిక్స్ రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా కంగనా రనౌత్ ఏఎల్ విజయ్ దర్శత్వంలో జయలలిత పాత్రలో నటించనుండగా.. నిత్యామీనన్ మహిళా దర్శకురాలు ప్రియదర్శని దర్శకత్వంలో అమ్మ పాత్రలో నటిస్తోంది. 

తాజాగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో జయలలిత బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ది ఐరన్ లేడీ' అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది.నిత్యామీనన్ మాట్లాడుతూ.. జయలలిత బయోపిక్ లో అవకాశం రావడానికంటే ముందుగానే అమ్మ గురించి నాకు అనేక విషయాలు తెలుసు. ఆమెని ఎక్కువగా ఫాలో అయ్యేదాన్ని. ఆమె ఇంటర్వ్యూలు చూశా. 

జయలలిత గురించి నాకు అర్థమైన విషయం ఏమిటంటే.. ఆమె చుట్టూ అనేక కుట్రలు జరిగాయి. తిరుగులేని నాయకురాలిగా ఆమె ఎలా ఎదిగారు అనే విషయాలు తెలుసుకున్నా. 

జయలలిత లక్షణాలు నాలో చాలా ఉన్నాయి.. ఆమె మాటతీరు, సమయపాలన, నడవడిక ఇలా చాలా విషయాల్లో మాఇద్దరిలో దగ్గరి పోలికలు ఉన్నాయి. దర్శకురాలు ప్రియదర్శని కూడా ఇదే విషయాన్ని గమనించారు. అందుకే నేను జయలలితాలా నటించడానికి ఎక్కువగా కష్టపడలేదు. 

ఆమె ఇంటర్వ్యూలు ఎక్కువగా చూడడం వల్ల జయలలిత మాటతీరు నాకు అలవాటైంది. జయలలిత బయోపిక్ చిత్రం కోసం నేను ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. జయలలిత బయోపిక్ పై మరికొన్ని చిత్రాలకు ప్రకటన వచ్చింది. అయినా కూడా మా దర్శకురాలు ఎలాంటి ఆందోళన చెందలేదు. ఎవరెన్ని సినిమాలు తీసుకున్నా పర్వాలేదు. మన సినిమా వేరు.. కథ వేరు అని ఆమె అన్నారు. 

దీనితో తాను కూడా ఎలాంటి ఆందోళనకు గురికాలేదని నిత్యామీనన్ తెలిపింది. మా చిత్రంలో జయలలిత జీవితంలో జరిగిన సంఘటనలని వాస్తవాలుగా చూపించబోతున్నాం అని నిత్యామీనన్ తెలిపింది.