కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు కొందరు మద్దతు తెలుపుతుంటే.. కొన్ని వర్గాల ప్రజలు, సెలెబ్రిటీల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా సీఏఏ బిల్లుని వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటి నందిత దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నందితా దాస్.. దర్శకురాలిగా కూడా సత్తా చాటింది. 

ఓ కార్యక్రమంలో పాల్గొన్న నందిత దాస్.. సిఏఏ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు దేశాన్ని మతాల పరంగా విభజించే విధంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా  ఆమె సిఏఏ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

సీఏఏ బిల్లుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విద్యార్థులని, నాయకులని ఆమె అభినందించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే షహీన్ బాగ్ తరహాలో దేశం మొత్తం నిరసనలు మొదలవుతాయని హెచ్చరించారు. ఈ బిల్లు వల్ల దేశంలోని ప్రజలు తాము నాలుగు తరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నామని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

ఇది చాలా బాధాకర అంశం..దీని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాలని నందితా దాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇండియా ఎకానమీ దెబ్బతినింది. ఉద్యోగావకాశాలు లేవు. దీనికి తోడు ఇండియాలో మతపరమైన గొడవలు జరుగుతున్నాయని ఈ బిల్లు వల్ల ప్రపంచం ముందు మన పరువు పోయే పరిస్థితి వచ్చింది అని నందిత అన్నారు. సిఏఏ బిల్లు పరోక్షంగా ముస్లింలని టార్గెట్ చేసే విధంగా ఉందని అన్నారు.