హైదరాబాద్: తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నవారి తీరుపై హీరోయిన్ మీరా చోప్రా మరోసారి స్పందించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెబుకుంటూ ఆమెపై కొంత మంది తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనకు ఎన్టీఆర్ గురించి తెలియదని, తాను ఎన్టీఆర్ అభిమానిని కాదని, మహేష్ బాబు అంటే తనకు ఎక్కువ ఇష్టమని చెప్పినందుకు మీరా చోప్రాను అసభ్య పదజాలంతో తిడుతూ ట్విట్టర్ వేదికగా కొంత మంది మీరా చోప్రాపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై ఆమె హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దానిపై మీరా చోప్రా మరికొన్ని ట్వీట్లు చేశారు. దీన్ని ఎలా అపడమంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మహిళలకు గౌరవం లేదని అన్నారు. కనీసం మా గొంతును కూడా వినిపించనివ్వరా అని ఆమె ప్రశ్నించారు. తమ తల్లిదండ్రులు చనిపోవాలని కోరుకున్నారని ఆమె అన్నారు. తనపై సామూహిక అత్యాచారం చేస్తామని అన్నారని, యాసిడ్ దాడి చేస్తామని బెదిరించారని ఆమె అన్నారు. 

తనను అసభ్య పదజాలంతో తిట్టారని ఆమె అన్నారు. ఇవాళ నేను, రేపు మరొకరు అని ఈ పోరాటంలో తాను నిలబడుతానని అన్నారు. ప్రస్తుతం వాళ్లు (ఎన్టీఆర్ అభిమానులమనని చెప్పుకుంటున్నవారు) మిగతా నటులను కూడా అవమానపరుస్తున్నారని మీరా చోప్రా అన్నారు. అసలు వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 

మహిళల గౌరవం పక్కన పెట్టండి, కనీసం వారు ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని ఆమె అన్నారు. తనను ఎవరైతే  దూషిస్తున్నారో వారందరికీ తాను ఒక్కటే చెప్పదలుచుకున్నట్లు తెలిపారు. 

ఇప్పుడు మనమంతా కోవిడ్ -19 రూపంలో ఓ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నామని, ప్రపంచంలో ఎతంో మంది ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నారని అంటూ కానీ మీరు మాత్రం.. మీ అభిమాన నటుడు నాకు తెలియదన్నందుకు నన్ను దూషిస్తూ రాక్షసానందం అనుభవిస్తున్నారని, ముందు వెళ్లి మీ జీవితాలను కాపాడుకోండి అని మీరా చోప్రా అన్నారు.