ఈ ఏడాది కరోనా కారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రాణాలు విడిచారు. ప్రతిరోజూ ఎవరో ఒకరు కరోనాకు బలికావడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. కోలీవుడ్ లో ఈ మరణాల రేటు మరింత ఎక్కువగా ఉంది. ఇక రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో అక్కడ మరణాలు సంభవించాయి. తాజాగా నటుడు, నిర్మాత వెంకట్ సుభా కరోనా సోకి మరణించారు. సుభా మృతికి కోలీవుడ్ పరిశ్రమ విచారం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. 


అయితే నటి కస్తూరి శంకర్‌ నటుడు సుభా మరణానికి సంతాపం తెలుపుతూ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్ దుమారం రేపుతోంది. ఓ వర్గం ఆమె ట్వీట్ పై ఆవేశం వ్యక్తం చేస్తున్నారు.  కస్తూరి తన ట్వీట్ లో ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు. కొద్ది రోజుల కిందటే ఆయన ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు జ్వరం వచ్చింది. టెస్టులు చేసుకోగా ఫలితాలు నెగిటివ్‌ వచ్చాయి. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. సారీ సుభాగారు’ అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. 


పరోక్షంగా సుభా మరణానికి ఉదయనిధి కారణం అన్నట్లుగా ఆ ట్వీట్ ఉందని కొందరు భావిస్తున్నారు. దీనితో డీఏంకే పార్టీ కార్యకర్తలు ఆమెపై మండిపడుతున్నారు. అయితే ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అంటు కస్తూరిపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు నటి రాధికా సైతం సుభా అకాల మరణానికి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకు గల అనుబంధాన్ని, పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు.