మా అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించడంతో నరేష్ అధ్యక్షుడిగా పదవీ భాద్యతలు చేపట్టాడు. నరేష్ ప్యానల్ లో జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. నెలల వ్యవధిలోనే మా అసోసియేషన్ నరేష్ వర్గం, జీవిత వర్గంగా చీలిపోయింది. 

గత ఆదివారం జీవిత తన సొంతంగా మా అసోసియేషన్ మీటింగ్ నిర్వహించడంతో నరేష్ వర్గం ఆగ్రహంతో ఉన్నారు. కనీసం తనకు అధ్యక్షుడిగా గౌరవం ఇవ్వడం లేదని నరేష్ అంటున్నారు. ఆదివారం మీటింగ్ కు నేను ఆదేశాలు ఇవ్వలేదు. కాబట్టే నేను హాజరు కాలేదని నరేష్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

నరేష్ కు కౌంటర్ గా జీవిత తన వర్గంతో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవితతో పాటు నటి జయలక్ష్మి, నటి హేమ పాల్గొన్నారు. హేమ మాట్లాడుతూ నరేష్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. నరేష్ మా అసోసియేషన్ లో తన సొంత టీమ్ ని ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా లాయర్ ని  పెట్టుకున్నారు. 

కానీ సమస్యలపై మాత్రం స్పందించడం లేదు. మా అసోసియేషన్ లో నరేష్ కు ఉన్న హక్కులు జీవిత మేడం కు ఎందుకు ఉండవు అని హేమ ప్రశ్నించింది. శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేంగా మీరు వ్యవహరించలేదా.. ఇప్పుడు జీవిత మేడం చేసేది మాత్రం తప్పైపోయిందా అని హేమ ప్రశ్నించింది. 

మా అసోసియేషన్ మీటింగ్ కు నేను ఆదేశాలు ఇవ్వలేదు.. కాబట్టి నేను హాజరు కాను.. నేను పట్టించుకోను అంటే ఎలా అని హేమ అన్నారు. అధ్యక్షడిగా మా అసోసియేషన్ లో ఓ మీటింగ్ జరుగుతుంటే దాని గురించి తెలుసుకుని హాజరు కావాల్సిన భాద్యత మీకు ఉంది అని హేమ తెలిపింది. 

ఏవైనా పొరపాట్లు జరిగితే ఇలా కాదు అని మీరే మాకు చెప్పాలి. సమావేశం ఉందనగానే..హాజరు కావద్దని సభ్యులందరికి మెసేజ్ లు పెట్టడానికి మాత్రం మీకు టైం ఉంటుంది.. మా సమస్యలు వినడానికి, మా అసోసియేషన్ కోసం టైం కేటాయించడానికి మాత్రం మీకు తీరిక ఉండదా అంటూ హేమ నరేష్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.