సీనియర్ నటి గీతాంజలి  ఆ మధ్యన ఓ యూ ట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక  పాత విషయాలను గురించి ప్రస్తావించారు. అందులో ఎన్టీఆర్ గురించి ఆవిడ మాట్లాడేటప్పుడు అందులో అభిమానం , గౌరవం తొంగి చూసేవి. ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో సీతగా ఎన్టీఆర్‌ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఆమె తనదైన నటనతో మెప్పించారు.  

(Also Read) పదేళ్ల తరువాత గీతాంజలి రీ ఎంట్రీ.. బలవంతంగా ఆ పాత్ర చేయాల్సి వచ్చింది!

గీతాంజలి మాట్లాడుతూ... "మేము కాకినాడ నుంచి వచ్చాం .. చెన్నైలో ఎవరూ తెలియదు. మా మంచితనాన్ని గ్రహించిన ఎన్టీఆర్ గారు .. మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఆయనకి ఇష్టమైన చికెన్ .. పులిహోర .. పొంగలి మా అమ్మగారు చేసి పంపించేవారు. ఉదయం పూట ఆయన టిఫిన్ చేయరు .. 8 గంటలకల్లా డైరెక్టుగా భోజనమే చేసేసే వారు. అందువలన ఉదయం 8 గంటలకల్లా అప్పుడప్పుడు మా ఇంటి నుంచి ఆయనకి ఇష్టమైనవి వెళుతూ ఉండేవి.

 ఉదయం ఆయన భోజనం చేసి షూటింగుకి బయల్దేరే సమయానికి, ఆయన ఇంటి గేటు దగ్గర ఓ పది బస్సుల జనం ఉండేవారు. వాళ్లంతా తిరుపతి వెళ్లే వాళ్లు .. ఎన్టీఆర్ ను చూసిన తరువాతనే అక్కడి నుంచి బయల్దేరేవాళ్లు. వాళ్లందరినీ ఆప్యాయంగా పలకరించి ఆయన స్టూడియోకి వెళ్లేవారు" అంటూ చెప్పుకొచ్చారు.      
సీనియర్ నటి గీతాంజలి ఈ రోజు కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్, జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1957లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన గీతాంజలి.. సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు.

సీతారామ కల్యాణం సినిమా ద్వారా సినిమాల్లో అడుగుపెట్టారు. కలవారి కోడలు, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, దేవత, గూఢచారి 113, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు.