టాలీవుడ్ లో హీరోయిన్స్ సంఖ్య గట్టిగానే ఉన్నప్పటికి స్టార్ హీరోలకు మాత్రం ఇంకా కొరతగానే ఉంది. ఈ కాలంలో ఒకసారి నటించిన హీరోయిన్ తో మరోసారి యాక్ట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. దర్శక నిర్మాతలు కూడా ఒకరిద్దరిని తప్పితే మిగతావారిని సినిమాల్లో రిపీట్ చేయడం లేదు. దానికి తోడు వరుస అపజయాలు కొంత మంది హీరోయిన్స్ క్రేజ్ ని దెబ్బ కొడుతున్నాయి.

ఆ లిస్ట్ లో హాట్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాద కూడా ఉంది. కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో మంచి సక్సెస్ అందుకుంటూ వరుసగా అవకాశాలని చేజిక్కించుకుంది. అయితే ఇష్టానుసారంగా బేబీ వచ్చిన సినిమాలన్నీ ఆలోచించకుండా ఒప్పుకోవడంతో కాస్త సందిగ్ధంలో పడింది. అమ్మడు హిట్టు చూసి చాలా కాలమవుతోంది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. మెహ్రీన్ సోదరుడు గుర్ఫాతే సింగ్ పిర్జాద ఇప్పుడు హీరోగా అడుగులు వేస్తున్నాడు.

అదికూడా బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో తెరక్కనున్న సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గుర్ఫాతే గత కొన్నేళ్లుగా వెండితెరకు పరిచయం అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఆ మధ్య కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ సోదరి మెహ్రీన్ సలహా మేరకు ఒప్పుకోలేదట. చిన్న సినిమా అయినా పరవాలేదు యాక్టింగ్ కి ఎక్కువగా స్కోప్ ఉండే కథలను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడంతో అతను ఇంతకాలం వెయిట్ చేసినట్లు టాక్. ఇక మెహ్రీన్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.