కరోనా భయంతో ప్రజలంతా ఇంటికే పరిమత మయ్యారు. ఒక మనిషి చూస్తే మరో మనిషి భయపడే పరిస్థితి ఎదురైంది. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా సంక్రమిస్తుండటంతో ఒకరితో ఒకరు కలవడానికి వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్ మాత్రం తన పెద్ద మనసును చాటుకుంది. సెలబ్రిటీలంతా విరాళలు ప్రకటించి చేతులు దులిపేసుకుంటుంటే.. హీరోయిన్ శిఖా మల్హోత్రా మాత్రం తానే నర్స్‌ గా మారి హాస్పిటల్‌లో రోగులకు సేవలందిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ఫ్యాన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న భామ శిఖా మల్హోత్రా. ఈ భామ ముంబైలోని ఓ హాస్పిటల్ లో కోవిడ్ 19 భారిన పడిన రోగులకు సేవలందిస్తోంది. ఢిల్లీలోని వర్ధమాన్‌ మహావీర్ మెడికల్‌ కాలేజ్‌, సఫ్ దార్‌ జంగ్ హాస్పిటల్‌ ల నుంచి ఈ భామ నర్సింగ్ లో డిగ్రీ పొందింది. ముంబైలో కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి.

ఈ సందర్భంగా శిఖా మాట్లాడుతూ `దేశానికి సేవ చేసేందుకు ఎప్పుడూ ముందే ఉంటాను. అది నర్స్‌ గా అయినా నటిగా అయినా నా వంతు నిర్వర్తించేందుకు నేను సిద్ధం. నాకు మీ ఆశీస్సులు కావాలి. దయచేసి  అందరూ ఇంటి దగ్గరే ఉండండి. జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వానికి సహకరించండి` అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది శిఖా మల్హోత్రా. అంతేకాదు తనలాగే మెడికల్ డిగ్రీ పొందిన అందరూ ఈ విషయంలో ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలు అందించాలని కోరింది.