కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ ఊహించని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఎవరికి ఎటు నుంచి వైరస్ సోకుతుందో కూడా అర్థం కావడం లేదు. సెలబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ ఈ వైరస్ బారినపడుతున్నారు. కాగా.. బాలీవుడ్ లోనూ ఈ వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. చాలా మంది నటులు  దీని బారిన పడుతున్నారు.

ఇప్పటికే అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య లాంటివారు కరోనా బారిన పడగా.. మరో నటుడికి కూడా కరోనా సోకింది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ, ఆయన భార్య, నటి భామిని ఓజా, సోదరుడు పునీత్‌లు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని అతడు స్వయంగా వెల్లడించాడు. 

గుజరాత్ హిట్ సినిమాలైన బే యార్, రాంగ్ సైడ్ రాజు, లవ్ ని భవాని వంటి సినిమాల్లో ప్రతీక్ నటించాడు. అలాగే, మిత్రోన్, సల్మాన్ ఖాన్ నిర్మించిన లవ్ యాత్రి వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. తాను తన భార్య భామిని ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా, తన సోదరుడు మాత్రం ఆసుపత్రిలో చేరినట్టు ప్రతీక్ ట్వీట్ చేశాడు. 

స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రేమపూర్వక మద్దతుతో వైరస్‌కు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నట్టు చెప్పాడు. సరైన సమయంలో స్పందించి మద్దతు ప్రకటించినందుకు బీజేపీ నేత కిరిట్  సోమయకు ప్రతీక్ గాంధీ కృతజ్ఞతలు తెలిపాడు.