యువనటుడు నండూరి ఉదయ్ కిరణ్ (34) హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో గుండెపోటుతో అతడు మరణించాడు. ఉదయ్ కిరణ్ భౌతిక కాయానికి పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.

'పరారే', 'ఫ్రెండ్స్ బుక్' వంటి చిత్రాల్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. పలు తమిళ చిత్రాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. గతంలో ఈ నటుడి పేరు పలు వివాదాల్లో వినిపించింది. 2016లో జూబ్లీహిల్స్ లో ఓ పబ్ లో గొడవ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

లగ్జరీ లైఫ్ కి అలవాటుపడిన ఉదయ్ కిరణ్ గతంలో పలు నేరాలకు పాల్పడినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో కూడా అతడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కాకినాడలో ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో కూడా అతడిని అరెస్ట్ చేశారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 59లోని నందగిరిహిల్స్‌లో ఇంటి యాజమానిపై దౌర్జన్యం చేయడంతో 2018లో క్రిమినల్‌ కేసు పెట్టారు. ఇలా చాలా మందిని మోసం చేయడంతో అతడిపై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఒకానొక సమయంలో అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో మానసిక చికిత్సాలయంలో ట్రీట్మెంట్ అందించారు.