క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు బ్రహ్మాజీ. తన ఇన్నేళ్ల కెరీర్ లో రకరకాల పాత్రలు పోషించిన బ్రహ్మాజీ తన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం పెద్దగా మాట్లాడరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన రియల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ఆల్రెడీ పెళ్లై కొడుకు ఉన్న శశ్వతిని ఆదర్శ వివాహం చేసుకున్నారు బ్రహ్మాజీ.

ఇంతకీ వీరి ప్రేమ కథ ఎలా మొదలైందంటే.. బ్రహ్మాజీ చెన్నైలో ఉన్న రోజుల్లో శశ్వతితో పరిచయమైందట. అప్పటికే ఆమెకి పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడట. ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకొని ఉందట. కొన్నాళ్లపాటు ఆమెతో జర్నీ చేసిన బ్రహ్మాజీ చివరకు ఆమెని పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆమె తనకు ఎందుకో బాగా కనెక్ట్ అయిందని.. తనకు నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నానని.. అదేమీ గొప్ప విషయం కాదని అన్నారు.

ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడమనేది ముఖ్యమని అన్నారు. ఆమెని పెళ్లి చేసుకున్న తరువాత పిల్లలు వద్దనుకున్నట్లు మరో విషయాన్ని వెల్లడించారు. తన భార్యకి అప్పటికే కొడుకు ఉండడం, చిన్నప్పటి నుండి ఆమె కొడుకు బ్రహ్మాజీకి కూడా తెలియడంతో ఇక మళ్లీ పిల్లలు వద్దనుకున్నారట. ఒకవేళ పిల్లలు పుడితే తను ఎక్కడ స్వార్ధంగా ఆలోచిస్తానో అని భయపడి పిల్లలను వద్దనుకున్నామని చెప్పుకొచ్చారు.

తన కొడుకుకి కూడా సినిమాల మీద ఆసక్తి ఉండడంతో కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించానని చెప్పారు. ఇది ఇలా ఉండగా.. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ కుమార్ త్వరలోనే హీరోగా టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో నిత్యాశెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ కూడా ఓ పాత్రలో కనిపించనున్నారు.