ఇది 1952 నాటిమాట .  'వద్దంటే చిత్రం' షూటింగ్ గురించి..
 
ఒక ఆకుపచ్చని మోరిస్ మైనర్ కారు - కోడంబాకం హై రోడ్డులో ఒక ఇంటి గుమ్మానికి కొంచెం దూరంలో ఆగింది. డ్రైవర్ సీటులోంచి ఓ స్పురద్రూపి దిగారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టు, ఓ లాల్చీ, చేతిలో ఓ ఫైలూ పట్టుకుని , కారు డోర్ తాళం వేసి, ముందుకు నడిచి, ఆ ఇంటి గేటు వైపు కదిలాడు. ఆ ఇంటి ముంగిట ఎడమ ప్రక్కనున్న ఓ పర్ణశాలలోకి ప్రవేశించాడు.

పప్పాజీ ఉన్నారా అని అడిగాడు

ఉన్నారు..లోపల కూర్చోండి అని ఆయనను కూర్చోబెట్టి, లోనికి వెళ్లాడు అక్కడి ఆఫీస్ ఇన్ ఛార్జ్.మరికాస్సేపటికి పప్పాజీ వచ్చారు. ఆయన తో పాటు స్వామీజీ కూడా వచ్చారు. 

పప్పాజీ అంటే చలన చిత్ర పితామహుడు శ్రీ హెచ్ ఎం రెడ్డి. స్వామీజి అంటే వారి అభిమాన పుత్రుడు శ్రీ వైఆర్ స్వామి. 'వద్దంటే చిత్రం' దర్శకుడు. ఆ వచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. విజయా ప్రొడక్షన్ వారి చిత్రాల్లో మాత్రమే నటించాలన్న ఎగ్రిమెంట్ పూర్తైన తర్వాత ఇతర నిర్మాతల చిత్రాల్లో నటించటానికి అంగీకరించిన చిత్రాల్లో ఒకటి వద్దంటే డబ్బు. ఆ చిత్రం తాలూకు పూర్తి డైలాగులు కూడిన స్క్రిప్టు వారి చేతిలో ఉంది.  రచయిత సదాశివ బ్రహ్మం గారు రాసారు.

అక్కడున్న ఆఫీస్ స్టాఫ్ ని అందరినీ పేరు పేరునా అడిగి పరిచయం చేసుకున్నారు రామారావు.  కాస్సేపు పిచ్చాపాటి అయ్యాక...

పప్పాజీ..మీరు పంపిన స్క్రిప్టు పూర్తిగా క్షణ్ణంగా చదివాను. కాస్సేపు మీరు ఉంటానంటే నా డైలాగులు అన్నీ నా  ఫక్కీలో మీకు వినిపిస్తాను. ఆ తర్వాత మీ ఇష్టప్రకారం మార్పులు చేసుకోవచ్చు అన్నారు రామారావు గారు.

ఆయన అలాగే అనటంతో రామారావుగారు మొత్తం డైలాగులు అన్నీ చదివి వినిపించారు. పెద్దాయన కొన్ని మార్పులు చెప్పారు. వాటిని తిరిగి నోట్ చేసుకున్నారు రామారావు.

ఆ చిత్రం పూర్తిగా 30 రోజులు కేవలం రాత్రిళ్లు మాత్రమే షూటింగ్ జరిగింది. సాయింత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకూ. అవుట్ డోర్ దృశ్యాలు మాత్రమే పగల చిత్రీకరించారు. అవి సినిమాలో చాలా తక్కువ.  కేవలం ఫెరఫెక్ట్ స్క్రిప్టు..అంతకుమించి అద్బుతమైన నిబద్దత కలిగిన నటుడు ఎన్టీఆర్ ఉండటం వల్లనే ఇది సాధ్యమైంది అని అప్పట్లో చెప్పుకునేవారు. 

హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ఈ  ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ‘మాస్టర్‌ బద్దంకి’ అనే పాత్రలో అల్లు రామలింగయ్య నటించే అవకాశం దొరికింది. వై.ఆర్‌.స్వామి దర్శకత్వంలో ఎన్‌.టి. రామారావు, జానకి నటించిన ఈ చిత్రం 1954లో విడుదలై విజయవంతం కావడంతో రామలింగయ్యకు నటుడిగా ఇండస్ట్రీలో  గుర్తింపు వచ్చింది. (విజయ చిత్ర నుంచి)