బ‌యోపిక్‌ల వరసలో మ‌రో సినిమా రెడీ అవుతోంది. ఈసారి గ్రాండ్ మాస్టర్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్ జీవిత క‌థ‌ని తెర‌పై తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏకంగా ఐదు సార్లు ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొని అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశిన ఆయన బయోపిక్ ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన జీవితంలో ఉన్న ఎత్తు ప‌ల్లాలను ఆవిష్కరించనున్నారు.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో ఈ బయోపిక్‌ సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. దీన్ని ఆయనే తన సొంత నిర్మాణ సంస్థ కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌లో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆయన అక్షయ్‌ కుమార్‌, ధనుష్‌ హీరోలుగా ‘అట్రాంగి రే’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే విశ్వనాథన్‌ జీవితకథను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. 

నిజానికి విశ్వనాథన్‌ జీవితకథను సినిమాగా తీసుకురావాలని గతంలో చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అందుకు ఆయన అంగీకరించలేదు. ఎట్టకేలకు ఆనంద్‌.ఎల్‌.రాయ్‌ ఆయన్ని ఒప్పించగలిగారు. ఇప్పటికే విశ్వనాథన్‌ ఆనంద్‌ పాత్రలో కనిపించబోయే నటుడి కోసం వేట మొదలుపెట్టారు. విశ్వనాథన్‌ ఆనంద్‌ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌తో‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.  ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో  సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.