అల వైకుంఠపురములో సినిమాతో ఈ ఏడాది సూపర్‌ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్‌. లాంగ్ గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్‌తో ఆకట్టుకున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అయితే బన్నీ మాత్రం ఇంకా షూటింగ్ లో పాల్గొనలేదు. అయితే ఈ లోగా లాక్ డౌన్‌ ప్రకటించటంతో షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ కోసం మరింతగా రెడీ అవుతున్నాడు బన్నీ.

సుకుమార్ కూడా పుష్ప కథకు మరింతగా మెరుగులు దిద్దుతున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పై ఓ భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్‌ సీన్‌ కు భారీగా ఖర్చు పెడుతున్నారట. దాదాపు 6 నిమిషాల నిడివి ఉండే ఈ యాక్షన్‌ సీన్‌కు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు.

పాన్‌ ఇండియా సినిమా కావటంతో నిర్మాతలు బడ్జెట్‌ విషయంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా ముందుగా విజయ్‌ సేతుపతిని తీసుకోవాలని భావించారు. కానీ డేట్స్‌ అడ్జెస్ట్ కాకపోవటంతో ఆ స్థానంలో బాబీ సింహను తీసుకోవాలని భావిస్తున్నారు.