ఒక్కడిగా వచ్చాడు. ఒక్కటి నుంచి మొదలుపెట్టాడు. ఒక్కొక్కటిగా సాధిస్తూ, రెండు దశాబ్దాలకుపైగా ఒకటో స్థానంలో నిలబడ్డ వెండితెర తార, అభిమానుల ఆరాధ్య దైవం, పరిచయం అక్కర్లేని వ్యక్తి, అభిమానుల గుండెలనే తన శాశ్వత చిరునామాగా మార్చుకొని చిరస్థాయిగా ఎల్లప్పటికే నిలిచిపోయే చిరంజీవి గారి తొలి సినిమా విడుదలై రేపటికి  42 సంవత్సరాలవుతుంది. 

ప్రాణం ఖరీదు సినిమా విడుదలై రేపటికి 42 సంవత్సరాలు పూర్తవుతుంది. చిరంజీవి మొదట షూటింగ్ చేసింది పునాదిరాళ్ళకే అయినా ఫస్టు విడుదలైంది మాత్రం ప్రాణంఖరీదు. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు సినిమా విడుడుదలయ్యింది. చింతపెంట సత్యనారాయణ రావు గారు రాసిన ఒక నాటిక ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రానికి కూడా వారే కథను అందించడంతోపాటు మాటలు కూడా రాసారు. 

కే. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్రవంతి, సీతారామయ్య గారి మనవరాలు వంటి హిట్ చిత్రాల దర్శకుడు క్రాంతి కుమార్ నిర్మించాడు. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ పేరు నరసింహ. బధిరుడైన చంద్రమోహన్ చెల్లి బంగారి ని ప్రేమించే వ్యక్తిగా చిరంజీవి ఈ సినిమాలో నటించాడు. 

రేపు సెప్టెంబర్ 22 అవడం, అదే రోజు చిరంజీవి 151వ సినిమా సైరా  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండడం, రేపే తొలి లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేస్తుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. సోషల్ మీడియాలో ఈ విషయంగా పెద్ద బజ్ నడుస్తుంది.