సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ’ మళ్లీ వార్తల్లో నిలిచింది.  మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీగా నష్టాలు మిగిల్చింది. అయితే ఓ విషయంలో మాత్రం ఈ సంవత్సరం రిలీజైన హిట్ సినిమాలను దాటిందని సమాచారం. ఈ సంవత్సరం సూపర్ హిట్స్ గా నిలిచిన ఎఫ్ 2, మహర్షి, యావరేజ్ అనిపించుకున్న సాహో సినిమాలు ఓ విషయంలో 'వినయ విధేయ రామ’ రికార్డ్ తో పోటీ పడలేకపోయాయని అంటున్నారు.  ఆశ్చర్యంగా ఉందికదూ..?

అయితే ఈ సినిమాలు  'వినయ విధేయ రామ’ ను భాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో గెలిచాయి. కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో ఫెయిలయ్యాయని అని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు వినయ విధేయ రామ శాటిలైట్ రైట్స్ 23 కోట్లుకు అమ్మారు. అందుకు కారణం బాలీవుడ్ లో పాపులర్ అయ్యిన కైరా అద్వాని, వివేక్ ఒబరాయ్ లీడ్ రోల్స్ లో ఉండటమే అంటున్నారు. బోయపాటి శ్రీను స్ట్రాటజీ ఆ విషయంలో సక్సెస్ అయ్యిందన్నమాట. సినిమాలో ఎలాగో క్రైమ్ ఎలిమెంట్, ఫైట్స్ ఉండటం, రామ్ చరణ్ ఆల్రెడీ హిందీ వాళ్లకు తెలిసున్న వాడు కావటంతో ఈ రేటు అందుకుందని చెప్తున్నారు.

 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం 'వినయ విధేయ రామ'. యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించడంలో సిద్ధహస్తుడైన బోయపాటి శ్రీను ఈ సినిమా తెరకెక్కించాడు. 'సరైనోడు' వంటి ఘనవిజయం తరువాత మెగా కాంపౌండ్‌లో బోయపాటి చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ థియేటర్లలో ఆ అంచనాలను అందుకోలేక చతికిల పడింది.